భూముల ధరల సవరణ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలపై మంత్రి పొంగులేటి ఆదేశం

  • భారీగా హెచ్చతగ్గులున్న ధరలను క్రమబద్ధీకరించాలని సూచన
  • పని వేళలను సవరించాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచన
తెలంగాణలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే పనివేళలు సవరించాలని  కూడా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక రద్దీ ఉన్న చంపాపేట, సరూర్ నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, షాద్ నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఫరూఖ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు పని వేళలను 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఈ 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైతే మరింత సమయాన్ని పెంచుతామని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని పెంచాలని సూచించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహసీల్దార్ కార్యాలయాలను సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు.

Ponguleti Srinivas Reddy
Telangana land prices
land prices revision
registration offices
registration timings

More Telugu News